Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా ఫ్రెండ్ చంద్రబాబునాయుడికి వందశాతం 'రిటర్న్ గిఫ్ట్' ఇస్తా: సీఎం కేసీఆర్ సెటైర్

  • చంద్రబాబు వచ్చి మా దగ్గర పని చేశారు
  • నేను పోయి అక్కడ పనిచేయొద్దా?
  • బాబు నాకిచ్చిన గిఫ్ట్ కు నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొద్దా!
ఏపీ రాజకీయాల్లో కలుగజేసుకోవాలని, లక్షలాది మంది అక్కడి అభిమానులు తమను కోరుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయమై తమకు ఫోన్లు, వాట్సాప్ మెస్సేజ్ ద్వారా ప్రజలు కోరుతున్నారని, తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే తమ అభిమతమని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి తమకు గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకు, తగిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ వ్యంగ్యంగా అన్నారు.

‘తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబునాయుడు గారు చెప్పారు. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్ కు లేదా? తప్పకుండా, తెలుగు ప్రజలు బాగుండాలని వందశాతం నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ లక్షకు పైగా ఫోన్లు వచ్చాయి. ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ మెస్సేజ్ లు బోలెడు వచ్చాయి. మా వాళ్ల ఫోన్లు పగిలి పోయే పరిస్థితి!

నేను సరదాగా చెప్పట్లేదు.. నిజాయతీగా చెబుతున్నాను. ‘మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి’ అని అడుగుతున్నారు. దేశ రాజకీయాలు బాగు చేసే క్రమంలో, తెలుగు ప్రజల గౌరవం పెరగాలనంటే కలిసి పనిచేయాలి..చేస్తాం. చంద్రబాబునాయుడుగారొచ్చి మా దగ్గర పని చేశారు. నేను పోయి అక్కడ పనిచేయొద్దా? బర్త్ డే పార్టీకి గిఫ్ట్ ఇస్తే.. మళ్లీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా? ఇవ్వమా? ఇవ్వకపోతే మనది తప్పయితది. చంద్రబాబునాయుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ కు నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదనుకో.. ‘తెలంగాణ వాళ్లు సంస్కార హీనులు’ అంటారు. కాబట్టి, నా ఫ్రెండ్ చంద్రబాబునాయుడికి వందశాతం రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Chandrababu
kcr
telangana bhavan

More Telugu News